Thursday, February 16, 2012

సమీర్ - ఒక కాశ్మీర్ నిర్వాసితుడి కథ..

'డోగ్రాలంటే.. మీరు కశ్మీరీ వాళ్ళా? లేక పంజాబీలా? ' అని అడిగాను.. ఆ అబ్బాయిని. ఒక్కసారి తీక్షణంగా నావైపు చూసి.. 'నేను భారతీయుడ్ని!' అన్నాడు. సిగ్గనిపించింది. ఇదేంటి ఈ కుర్రాడితో చెప్పించుకున్నాను.. అయినా నా ప్రశ్న లో అంత తప్పేముంది? కొత్త గ్రూప్ లో చేరిన మొదటి రోజే.. ఇలా పాఠం చెప్పించుకున్నాను. అనుకుని ఒక మెంటల్ నోట్ చేసుకున్నాను, ఇతని దగ్గర ఎక్కువ తక్కువ వాగకూడదని. అయినా సినిమాల్లో, క్లాస్ రూం లో చెప్పినట్టు.. 'నేను మొదటగా భారతీయుడ్ని ట హహ్ ' అనుకున్నాను.

22 యేళ్ళుంటాయి అతనికి. అదే సమీర్ డోగ్రా ట పేరు. తెల్లగా.. గడ్డం తో.. వత్తయిన జుట్టు, నుదుటన బూడిద, పొడుగ్గా, పల్చగా.. కళ్ళజోడూ..

నా పక్క క్యూబ్ లో నే ఉండటం తో.. రోజూ.. అతని క్యూబ్ మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. మనిషెంత మూడీ అంటే.. ఒకరోజు.. 'కృష్ణాజీ.. ' అని నోరారా పిలిచి .. బ్రేక్ రూం లో చాయ్ తాగే వరకూ వదిలిపెట్టేవాడు కాదు. ఒక్కోరోజు అసలు నేనెవరో తెలియనట్టు ప్రవర్తించేవాడు.

నేను అందర్నీ.. టీజ్ చేసేదాన్ని ఏదో టాపిక్ మీద.. మధ్యాహ్నం భోజనం వేళ. అతను చాలా అల్లరి చేస్తూ అందరి మీద జోకులేస్తూ.. నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. కానీ..ఒక్కసారే.. మూడ్ ఆఫ్ అయిపోయేవాడు. నాకు చిత్రం గా ఉండేది.

ఒకసారి మాల్ లో మా కుటుంబం కూర్చుని ఐస్క్రీం తింటుంటే.. కనిపించాడు డోగ్రా, నలుగురైదుగురు స్నేహితులతో. వాళ్ళంతా కూడా అదే తెలుపు తో.. గడ్డాలతో కనిపించారు. బాగా మాట్లాడారు. పిల్లలని పలకరించారు.

మర్నాడు లంచ్ టైం లో సరదాగా అబ్బాయిలంతా సెలవ రోజుల్లో మాల్స్ కెళ్తారని నాకు తెలియదు.. అంటూ ఏదో టీజ్ చేయబోతే.. యమ సీరియస్ గా లుక్కిచ్చాడు. దెబ్బకి మళ్ళీ అలాంటి ప్రయత్నాలెప్పుడూ చేయలేదు.

రాను రానూ, రోజూ అతని పద్ధతి గమనించటం అలవాటైపోయింది. అన్ని గుళ్ళూ తిరిగే వాడు. క్యూబ్ లోంచి ఓంకారం, లేక గాయత్రీ మంత్రం వినబడేది ఎప్పుడూ..మంద్రం గా.

ఫన్ మెయిల్ ఎలియాస్ మొదలు పెట్టాడు. తర్వాత నన్ను ఓనర్ ని చేసి.. పూర్తిగా తప్పుకున్నాడు.

ఒకసారి గ్రూప్ మాగజీన్ ఐడియా ఇచ్చి అంతా ఒంటి చేతిమీద నడిపించాడు. రెండు ఇష్యూలు రాగానే.. అసలు పత్రిక చదవటం కూడా మానేశాడు.

ఒకసారి లంచ్ లు ఎరేంజ్ చేసేవాడు.. అందర్నీ..లాప్ టాప్ లు మూసేసి చేతులు పట్టుకుని లాగి మరీ తీసుకెళ్ళేవాడు.. ఒక్కోసారి గన్ పాయింట్ మీద కూడా వచ్చేవాడు కాడు.

సెలవ మీద జమ్మూ-కాశ్మీర్ కెళ్ళాడు. అక్కడ అమర్ నాథ్ యాత్రీకులని వెళ్ళనీకుండా ఆపి, అప్పట్లో గొడవలయ్యాయి. (2 యేళ్ళ క్రితం) తన ఇంటి బయట మనుషులని చంపడం అవీ జరిగాయిట కూడా. అతను బాగా చలించి.. కాశ్మీరీ పండితుల మీద జరిగిన ఆగడాలు, హిందువులని అమర్ నాథ్ యాత్రలకి వెళ్ళనీయక పోవటం, లాంటివీ, అసలు కాశ్మీర్ సమస్య, పాకిస్తానీ టెర్రరిస్టులు ఎలా కాశ్మీరాన్ని కబళించి వేసారో.. గ్రూప్ కి ఈమెయిల్ రూపం లొ పంపుతూ ఉండేవాడు.

కంపెనీ యాజమాన్యం నుండి వార్నింగ్ వచ్చాక.. ' మన వ్యథ ని అర్థం చేసుకోలేని కంపెనీ కి పని చేస్తే ఏమి? లేకపోతే ఏమి ?' అని బాధ పడ్డాడు. అతన్ని మేము.. ఎన్నో విధాలు గా నచ్చజెప్పాక.. ఇలాంటి ఈ మెయిళ్ళు జీ మెయిల్ గ్రూప్ తయారు చేసి పంపసాగాడు.

అతని బాక్ గ్రౌండ్ తెలిసాక.. అతని పట్ల మాకు సానుభూతి పెరిగి అందరం అతనికి స్నేహితులమైపోయాం. అతని కుటుంబానికి కాశ్మీర్ లో వర్తకం, వ్యవసాయం ఉన్నాయి. వాళ్ళ పెద్దనాన్న కుటుంబం మొత్తం ఊచకోత కోయబడ్డాక, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జమ్మూ కి చేరుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు అతని తల్లి దండ్రులు. ఇతని చిన్నతనం లో జరిగిన ఈ సంఘటన వల్ల అతను చాలా ఎఫెక్ట్ అయ్యాడు. మన ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి వీరి కుటుంబాన్ని నిలిపింది. ఆర్ ఈ సీ లో ఇంజనీరింగ్ చేసి ఇలా మా కంపెనీ లో చేరాడు.

కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చి పడేస్తే సగం శని వదులుతుందనేవాడు. ముస్లిం ల పట్ల అతనికి చాలా వ్యతిరేక భావాలుండేవి. చాలా సార్లు నచ్చ చెప్పేవాళ్ళం.. అలా వద్దని. కానీ ఫలితం శూన్యమనే చెప్పాలి. తాజ్ ఎటాక్ అప్పుడూ, జయ్ పూర్ బ్లాస్టులప్పుడూ, చాలా డిప్రెస్ అయి ప్రభుత్వానికి, ముస్లిం లకీ, పాకిస్తానీయులకీ వ్యతిరేకం గా మాట్లాడేవాడు.

ఒకసారి ఒకబ్బాయి.. ముజఫ్ఫరాబాద్ బీహార్ లో ఉందనుకున్నాడు. ఇతను ఉగ్ర రూపం దాల్చి.. 'అదేంటి ? ఆ మాత్రం తెలియదా? పీ ఓ కే లో ఉంది. అక్కడ జనాలు అంతమంది చస్తుంటే.. మీకు కనీసం ఎక్కడుందో ఐడియా కూడా లేదా ? అని హుంకరించాడు. నేను కలగచేసుకుని.. 'అతనికి తెలియదు.. ఓ కే.. నువ్వు చెప్పు కర్ణాటక సీ ఎం ఎవరో చెప్పు మొదలు..' అంటే చెప్పలేకపోయాడు. మూడేళ్ళపాటు ఉంటున్నావు బెంగళూర్లో. నీకామాత్రం తెలియదు. ..? ' అంటే.. నవ్వేసి.. 'యూ గాట్ మీ ఆన్ దట్ ' అని వెళ్ళిపోయాడు.

కోడింగ్ లో అతను దిట్ట. యాజమాన్యానికి నచ్చిన ఇంజనీర్. సంక్రాంతికి దాదాపు మా గ్రూప్ లో అందరూ సెలవ మీద వెళ్ళారని.. రెండేళ్ళ క్రితం పండుగ భోజనానికి ఇంటికి పిలిస్తే.. అరిటాకు లో ఆనందం గా భోజనం చేసి వెళ్ళాడు. మా పిల్లలతో కలిసి ఆడుతున్న అతన్ని చూస్తే.. చాలా ఆనందం గా అనిపించింది.

హైదరాబాద్ కెళ్ళి వస్తే.. కరాచీ బిస్కట్లు తెస్తే.. 'వాళ్ళు చేసిన బిస్కట్లు తినను.. ఏమీ అనుకోవద్దు క్రిష్నాజీ ' అనేశాడు.

ఇటీవల సానియా పెళ్ళయినప్పుడు మా గ్రూప్ వాళ్ళు 'మీ హైదరాబాదీ అమ్మాయి పెళ్ళి అయింది. నువ్వు కనీసం స్వీట్లైనా తేవా? ' అని పీడించి నా చేత బలవంతం గా కేక్ తెప్పించారు. డోగ్రా 'కంగ్రాట్స్.. ఈవిడ దుబాయ్ కెళ్ళి అక్కడ పిల్లల్ని కంటే సరిపోతుంది.. కనీసం భారతదేశం లో ఒక డజన్ మంది తగ్గుతారు వాళ్ళు ' అన్నాడు. అక్కడ అబ్దుల్ ఉన్నాడు. అతనేమనుకుంటాడో అని అందరం బాధ/భయపడి చూస్తే.. ' డోగ్రా సంగతి తెలిసిందే గా ' అన్నట్టు చిరునవ్వు తో ఉండి పోయాడు అతను. తర్వాత మా బాస్ ఇచ్చాడు లెండి వార్నింగ్.

ఇంటి కెళ్ళి వచ్చాడు. కాఫీ బ్రేక్ లో చెప్పాడు.. వాళ్ళ భూములూ అవీ చూసి వచ్చాడట, కాశ్మీర్ కెళ్ళి, తల్లి దండ్రులకి తెలియకుండా. ' రక్తం ఉడుకుతుంది నాకు ఏదో ఒకటి చేస్తా ' అన్నాడు. అందరం మళ్ళీ నీతి బోధలు చేశాం. విన్నాడో లేదో తెలియదు.

ఈ మధ్య నేనూ బిజీ గా ఉండి పట్టించుకోలేదు. 2 నెలల నుండీ, అందరి తోనూ మాట్లాడటం తగ్గించుకున్నాడు. ఒక్కోసారి అలా జరగటం పరిపాటే కదా.. అని నేనూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.


ఒక నెల రోజులనుండీ రావట్లేదు పని లోకి. బాస్ నడిగితే ..ఏదో పర్సనల్ ప్రాబ్లమనీ.. సెలవ మీద జమ్మూ కెళ్ళాడని చెప్పాడు. మొన్ననేగా వచ్చాడు.. మళ్ళీ ఏమయ్యిందో అనుకుని నా పని లో పడ్డాను.

ఈరోజు కాస్త జలుబు గా ఉందని ఇంట్లో ఉండిపోయాను సెలవు పెట్టి. సాయంత్రం.. నా జీ మెయిల్ చూడక చాలా రోజులయ్యిందని చూస్తే.. డోగ్రా నుండి గుడ్ బై మెయిల్ నెల క్రితం ది. కొద్ది మంది కే పంపాడు.

ఇదేంటని షాక్ దిని ఫోన్ చేస్తే తెలిసిన విషయాలు చాలా కలవర పరచాయి.

నెల క్రితం 2 రోజులు సెలవ పెట్టాడట. రూం మేట్ కూడా మా గ్రూప్ లోనే చేస్తాడు. అతను సాయంత్రం ఇంటికెళ్తే.. లేడు.. వస్తాడులే అని చూస్తే.. డోగ్రా 2 రోజులు రాలేదు. సెల్ ఫోన్ రూం లోనే వదిలేసాడు. అతని తల్లిదండ్రులకీ తెలియదు. దాంతో కంగారు పడి పోలీస్ రిపోర్ట్ ఇస్తే.. 10 రోజుల తర్వాత తల్లి దండ్రులు ఫోన్ చేసి చెప్పారుట. ఇంటికి ఫోన్ చేస్తున్నాడు కానీ.. ఒక నంబర్ నుండి కాదు. ఎక్కడ్నించి చేస్తున్నాడో చెప్పడు. బాసు మాత్రం ఇంకా ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ అనే అనుకుంటున్నాడట.

విషయం తెలిసాక, బాధో, కోపమో,ఆక్రోశమో, బెంగో .. ఏదో తెలియని భావం తో మెదడు మొద్దు బారిపోయింది. ఎక్కడున్నా, ప్రశాంతత అతనికి చేకూరాలని, మంచి దారిలోనే పయనిస్తున్నాడని ఆశిస్తూ...

కృష్ణప్రియ/

 http://krishna-diary.blogspot.in/2010/06/blog-post_22.html

No comments:

Post a Comment